టోంక్: రాజస్థాన్లోని టోంక్ జిల్లా పీప్లూ పంచాయతీ సమితి పరిధిలో వీధి దీపాల తొలగింపు వివాదానికి దారితీసింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలైన తర్వాతే అధికారులు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షతోనే ఈ చర్యలు చేపట్టారని పేర్కొంటూ అధికారులను అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వార్డు నంబర్ 4 పరిధిలోని కుమ్హారోన్ కీ ధని, బేగంపూర్, హనీఫ్గంజ్, బిజల్పురా గ్రామాల్లో ఎన్నికలకు ముందు సుమారు 50 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. నివాయ్ ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ వ్యక్తిగత సహాయకుడు అలోక్ శర్మ భార్య ప్రియాంక శర్మ ఈ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమి తర్వాతే జైపూర్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ (JVVNL) సిబ్బంది వీధి దీపాలను తొలగించడం ప్రారంభించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అయితే గ్రామస్తుల ఆరోపణలను విద్యుత్ శాఖ అధికారులు ఖండించారు. ఫాల్ట్ రిపేర్ టీమ్ (FRT) తనిఖీల్లో భాగంగా గ్రామాలను సందర్శించినప్పుడు విద్యుత్ స్తంభాలకు అక్రమంగా కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని JVVNL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీఆర్ మీనా వెల్లడించారు. విద్యుత్ నిబంధనలకు అనుగుణంగానే అక్రమ కనెక్షన్ల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 10 విద్యుత్ స్తంభాల నుంచి వీధి దీపాలను తొలగించినట్లు వివరించారు.
ఈ క్రమంలో అధికారుల చర్యలను స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిగిలిన 40 వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు ముందుకు రావడంతో అధికారులు మిగతా దీపాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు ఈ వివాదంపై ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ స్పందించారు. వీధి దీపాల తొలగింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీపావళి సందర్భంగా అభ్యర్థులు ఈ లైట్లను ఏర్పాటు చేశారని, వాటి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి నిబంధనల ప్రకారమే విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, వీధి దీపాలను అసలు ఎవరు ఏర్పాటు చేశారు? విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా కనెక్షన్లు ఎలా ఇచ్చారు? అనే అంశాలపై JVVNL ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
